Header Ads

పవన్ కళ్యాణ్ చంద్రబాబు మళ్లీ కలుస్తున్నారా??

పవన్ కళ్యాణ్ చంద్రబాబు మళ్లీ కలుస్తున్నారా??
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి 2019 సాధారణ ఎన్నికలకు గట్టిగా ఇంకొక  ఐదు నెలలు కూడా సమయం లేకపోవడంతో అక్కడ ఉన్న రాజకీయ పార్టీలన్నీ తమ తమ వ్యూహాలను అమలు చేయడం ప్రారంభించాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ద్వారా చివరికి ఎలాగో గట్టెక్కి అధికారంలోకి రాగలిగారు. ఆ సమయంలో గట్టిగా పోటీ ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ఈసారి ఎట్టి పరిస్థితిలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎవరితో ఏలాంటి పొత్తు లేకుండా ఒంటరిగానే మళ్లీ ఎన్నికల బరిలోకి దిగుతుందని జగన్ స్పష్టం చేశారు.

అలాగే ఇటు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ సారి జనసేన పార్టీ కేవలం కమ్యూనిస్టు పార్టీల తోనే పొత్తు పెట్టుకుని ఎన్నికల్లోకి వెళుతుందని చాలాసార్లు వివరించారు. అటు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని చావుదెబ్బ తిన్న తర్వాత మళ్లీ ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీతో వచ్చే శాసనసభ ఎన్నికల్లో పొత్తును కొనసాగిస్తుందా లేదా అన్నది ఒక సస్పెన్స్ డ్రామాగా నడుస్తూ ఉంది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఆంధ్రప్రదేశ్లో కనీసం తన ఉనికిని చాటుకోవడానికి ఈసారి వచ్చే ఎన్నికల్లో కనీసం ఒకటో రెండో శాసనసభ స్థానాల్లో అయినా గెలవాలని ప్రయత్నిస్తూ ఉంది.


ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కచ్చితంగా ఆయా రాజకీయ పార్టీల వ్యూహాలు ప్రతివ్యూహాలు సామాన్య ప్రజలకు మింగుడు పడని ధోరణి లో చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఆ కోవలోకి ఇప్పుడు మళ్లీ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి అనే వార్త  చెందుతుంది. పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీని స్థాపించినప్పుడు చాలా ఆవేశంగా మాట్లాడారు. తన అన్నని సైతం ఎదిరించి  పార్టీ పెడుతున్నానని ఎట్టి పరిస్థితుల్లో తాను అనుకున్నది సాధిస్తానని చాలా విషయాలు మాట్లాడారు. 2014 ఎన్నికలు వచ్చే సమయానికి ఆయన పార్టీ సంస్థాగతంగా ఇంకా బలంగా లేకపోవడం కనీస క్యాడర్ కానీ, టికెట్లు ఇచ్చి పోటీ చేయిద్దాం అనుకుంటే ఆ స్థాయి ఉన్న నాయకులు గానీ పార్టీలో లేకపోవడంతో చివరికి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఎన్నికల్లో తన మద్దతు ప్రకటించి ఆ పార్టీ అధికారంలోకి రావడానికి సహకరించారు. కుల సమీకరణలు బాగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ తన మద్దతు తెలుగుదేశం పార్టీకి ప్రకటించడం ద్వారా ఒక సామాజిక వర్గంని బలంగా ప్రభావితం చేసి గణనీయమైన ఓట్ల తేడాతో తెలుగుదేశం పార్టీ గెలవడానికి సహాయపడ్డారు.

 అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఏలాంటి పదవులను తీసుకోవడం గాని లేదా తనకు సంబంధించిన మనుషులకి ఆ పదవులు ఇప్పించడం లాంటి పనులు చేయలేదు. అయితే అనూహ్యంగా గత గడచిన సంవత్సరంనర కాలంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి ఎదురు తిరిగారు. ఆయన ప్రభుత్వం చేస్తున్న అవినీతిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల మీద ఫిర్యాదు చేస్తూ జనసెన సభల్లో  విరుచుకు పడ్డారు. తమకు మద్దతు ఇచ్చి తాము అధికారంలో అధికారంలోకి రావడానికి సహాయపడ్డ పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా తమకు వ్యతిరేకంగా మారేసరికి కొన్ని రోజుల పాటు తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఈ విషయాలు ఏవీ మింగుడు పడలేదు. ప్రజల తరఫున తాను పోరాటం చేస్తున్నా అని తాను మద్దతు ఇచ్చిన పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చి  అవినీతికి పాల్పడుతుందని ఇది తనకు నచ్చకే తాను ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అసలు పూర్తిగా అమలు చేయలేదని ఒక విధంగా తాను మద్దతు ఇచ్చినందుకు ప్రజలు నమ్మినందుకు తెలుగుదేశం పార్టీ మమ్మల్ని మోసం చేసిందని ఆయన ఆవేదన చెందారు.

ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు కి వ్యతిరేకం గా మారారో అప్పుడే అక్కడ త్రికోణ పోటీ మొదలైంది. అటు జగన్ ఇటు పవన్ కళ్యాణ్ మరోవైపు తెలుగుదేశం పార్టీ ఈ మూడు పార్టీల మధ్య ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. అయితే ఎన్నికలలో ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఎవరు చెప్పలేరు కాబట్టి మళ్లీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలుస్తారా లేదా పవన్ కళ్యాణ్ జగన్ కలిసి ఎన్నికలకి వెళ్తారా అన్నవి ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారాయి. చంద్రబాబు అపర చాణిక్యుడు అని చివరి నిమిషంలో ఏలాగేనా చక్రం తిప్పుతారని ఇప్పటినుంచే విభిన్నమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పాత స్నేహితుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మచ్చిక చేసుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని ఇప్పటికీ కొంతమంది ద్వారా మధ్యవర్తిత్వానికి ప్రయత్నించారని పుకార్లు వ్యాపించాయి. ఈమధ్య ఆంధ్రప్రదేశ్ లో జిల్లా నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ కూడా ఒక సమావేశంలో మాట్లాడుతూ తనకు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంతమంది మనుషులు దగ్గర్నుంచి మద్దతు కోసం మనుషులు వచ్చారని మనకు బలం ఉంది కాబట్టే వాళ్ళు మనల్ని మళ్ళీ కలుపుకుని పోవాలని ప్రయత్నిస్తున్నారని మనం వాళ్ళకి లొంగ కూడదు మళ్లీ మోసపోకూడదు అని చెప్పుకొచ్చారు. గత కొన్ని నెలలుగా ప్రజాపోరాట యాత్ర అనే పేరుతో పవన్ కళ్యాణ్


ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా పర్యటించినప్పటికీ ఉద్దానం లాంటి సమస్యల మీద బహిరంగంగా పోరాటం చేసి ప్రజలకు దగ్గరైనప్పటికీ ఆయన పార్టీకి ఇంకా సంస్థాగతంగా సరైన నిర్మాణం జరగలేదు కిందిస్థాయి కార్యకర్తల బలం లేదని చెప్పక తప్పదు. జనసేన పార్టీకి ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సరైన ఎమ్మెల్యే అభ్యర్థులు లేకపోవడం కూడా ఒక విధంగా ఆ పార్టీకి బలమైన దెబ్బ అవుతుంది. కమ్యూనిస్ట్ లను కలుపుకుని పోతున్న పవన్ కళ్యాణ్ వాళ్లకు ఉన్న ఏ బలాన్ని చూసి ఈ నిర్ణయం తీసుకున్నారో అర్థం కాదు. కమ్యూనిస్ట్ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో అత్యంత నామమాత్రంగానే ఉన్నాయి రేపు పొద్దున్న ఎన్నికలలో ఆ పార్టీలు తమకు పలాన సీట్లు కావాలని అడిగితే పవన్ కళ్యాణ్ ఆ పార్టీలకు ఆ సీట్లు ఇస్తారా ఇవ్వరా అనే విషయాలు కూడా వేచి చూడాలి.
పాత మిత్రులు మళ్లీ కలుస్తున్నారు అన్న మెసేజ్ ను బయటకు పంపించడం ద్వారా తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక విధంగా తన ప్రత్యర్థులు అయినటువంటి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి మీద ఒక విధంగా విజయం సాధించారని చెప్పాలి. ఎన్నికల వేళ చంద్రబాబు చేసే జిమ్మిక్కులు ఎలా ఉంటాయి అన్నది ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా బాగా తెలుసు. ఆయన ఏ క్షణంలో ఎలా అయినా  మారగలరు ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోగలరు పార్టీలో తనే సుప్రీమ్ కావడం తనకు ఎదురు తిరిగే ధైర్యం కానీ తను తీసుకున్న నిర్ణయాల గురించి ఎదురు చెప్పే వారు కూడా ఎవరూ లేకపోవడం అనేది చంద్రబాబుకు కలిసి వచ్చే అంశం. అలాగే దశాబ్దాలుగా పార్టీకి ఉన్న కార్యకర్తలు కానీ ఒక బలమైన సామాజిక వర్గం కానీ ఆయనకు బ్రహ్మాస్త్రంగా మారుతాయి. ఉద్దండులైన పార్టీ నాయకులు పల్లెల్లో సంస్థాగతంగా బలంగా ఉన్న నిర్మాణం ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బలాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు.


వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గట్టి పోటీ వచ్చే అవకాశం ఉంది తాను చేసిన అభివృద్ధి పథకాలు ప్రజాసేవ గురించి చంద్రబాబునాయుడు విస్తృతంగా ప్రచారం చేస్తూ మళ్లీ ఎన్నికల్లో గెలవడానికి తన ఎత్తులు వేయడం ప్రారంభించారు. ఏది ఏమైనప్పటికీ ఈసారి 2019 లో జరగబోయే ఆంధ్ర ప్రదేశ్ సాధారణ ఎన్నికల్లో చాలా రసవత్తరంగా ఉండబోతున్నాయి. తొమ్మిదేళ్లుగా అధికారానికి దూరంగా ఉండి కేసులు కోర్టులు అంటూ తిరుగుతున్న జగన్ మోహన్ రెడ్డి ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని తపన పడుతూ ఉంటే మరొక వైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో చేసిన తప్పిదం పునరావృతం కాకుండా తెలుగుదేశం పార్టీకి ఒక గుణపాఠంగా ఈ ఎన్నికల్లో అత్యధిక అసెంబ్లీ స్థానాలు తాను గెలుచుకొవాలని తద్వారా తన సత్తా ఏంటో మళ్లీ ఒకసారి చంద్రబాబు నాయుడుకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపెట్టాలని పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారు. ఈసారి కచ్చితంగా మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవడం ద్వారా అటు ప్రతిపక్ష పార్టీకి ఇటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు  ఒకే సారి చెక్ పెట్టాలని  చంద్రబాబునాయుడు శతవిధాల తన ప్రయత్నాలు ప్రారంభించారు. అంతిమ తీర్పు ప్రజలదే కాబట్టి 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఏ పార్టీ గెలుస్తుందనేది కాలమే నిర్ణయించాలి.

No comments